మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్న ట్రంప్‌.. వచ్చే వారంలో ఇరాన్‌పై భీకర దాడులు?

  • చర్చలు విఫలమైతే మళ్లీ వైమానిక దాడులు
  • ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పెంటగాన్‌
  • ఇజ్రాయెల్‌తో కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాలు
  • ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ సంచలన కథనం
చైనా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలను సైనిక బలంతోనే పరిష్కరించేందుకు వైట్‌ హౌస్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై తిరిగి వైమానిక దాడులు చేయాలని పెంటగాన్‌ వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కొంది. ఈ కథనం ప్రకారం..

బీజింగ్‌ నుంచి వచ్చే సమయంలోనే ఇరాన్‌ శాంతి ప్రతిపాదనలను ట్రంప్‌ పూర్తిగా తిరస్కరించారు. ‘‘నేను ఆ ప్రతిపాదనను చూశాను. అందులో మొదటి వాక్యమే నాకు నచ్చలేదు. అందుకే దాన్ని పక్కన పడేశాను’’ అని ట్రంప్‌ మీడియాతో అన్నారు. వచ్చే వారంలోనే ఇరాన్‌పై దాడులు జరిగే అవకాశం ఉంది. అందుకోసం అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు చరిత్రలోనే అతిపెద్ద ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు పశ్చిమాసియా నిఘా వర్గాలు చెబుతున్నాయి.

గత నెలలో కుదిరిన కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ని కొత్త పేరుతో తిరిగి ప్రారంభించేందుకు అమెరికా రక్షణ శాఖ సిద్ధమవుతోంది. హర్మూజ్‌ను మూసివేస్తే ఇరాన్‌ వ్యాపారాలన్నీ మూతపడతాయని ట్రంప్‌ పేర్కొన్నారు. గత రెండు వారాలుగా జలసంధి మూతపడడం వల్ల ఇరాన్‌కు రోజుకు 500 మిలియన్‌ డాలర్ల నష్టం జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు.

షీ జిన్‌పింగ్‌తో జరిగిన చర్చల్లో ఇరాన్‌ దగ్గర అణ్వస్త్రాలు ఉండొద్దనే విషయంలో చైనా తమతో ఏకీభవించిందని ట్రంప్‌ తెలిపారు. హర్మూజ్‌ను తెరిచి ఉంచాలని ఇరు దేశాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని మాత్రం తాను జిన్‌పింగ్‌ను కోరలేదని వెల్లడించారు.

Donald Trump
Iran
US Iran tensions
Iran nuclear program
China
Xi Jinping
Military exercises
Operation Epic Fury
Strait of Hormuz
Israel

More Telugu News